How to Build a Career in the Stock Market in Telugu – Stock Market Telugu

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ని కెరీర్ (Stock Market Trading Career) గా ఎంచుకోవడం ఎలా?

ఒక సర్వే ప్రకారం ఈ ప్రపంచంలో 85% మందికి వాళ్ళకి చేస్తున్న ఉద్యోగం నచ్చడం లేదట. ప్రతిరోజు రొటీన్ గా ఒకేపని చెయ్యడం, నైట్ షిఫ్ట్ లు, పని ఒత్తిడి , పీడించుకుని తినే బాస్, ట్రాఫిక్ లో ప్రతి రోజు ఆఫీస్ కి వెళ్లి రావడం, వీటివలన చాలా మందికి  తాము చేసే ఉద్యోగం మీద ఆసక్తి లేకుండా బోరింగ్ గా గడిచిపోతుంది. కొంతకాలం తరువాత  వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా కూడా మనకు ఇష్టం లేని పనే చేసాం అనే బాధ కలగక మానదు.

కానీ ట్రేడింగ్ (Trading) లో అలా కాదు, మీరు ఎవరికీ సమాధానం చెప్పనవసరం లేదు. మీకు మీరే బాస్. ఆదివారం వస్తే ఆనందపడి, సోమవారం వస్తే బాధపడవలసిన అవసరం లేదు.  మీకు నచ్చిన సమయంలో, ప్రపంచంలో ఎక్కడి నుండి అయినా ట్రేడింగ్ చెయ్యవచ్చు. ప్రతి శని, ఆదివారాలు సెలవులు, పండగ సెలవులు ఎలాగో ఉంటాయి. మిగిలిన రోజులలో కూడా ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రేడింగ్ చేస్తే చాలు. ఒకవేళ మనం అనుకున్న ప్రాఫిట్ ముందే వస్తే వెంటనే ట్రేడింగ్ ఆపేసి ఫ్యామిలీ తో గడపవచ్చు. కుటుంబంతో కలిసి ఫంక్షన్స్ కి గాని, విహారయాత్రలకు గాని వెళ్ళవలసి ఉంటే ఎవరిని సెలవులు అడగవలసిన అవసరం ఉండదు. మన లైఫ్ అంతా కూడా మన కంట్రోల్ లోనే ఉంటుంది. ఇన్ని సౌకర్యాలు ఉండడం వలన చాలా మంది తాము చేస్తున్న ఉద్యోగం మానేసి స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలనుకుంటారు. అయితే ఇదంతా కూడా నాణానికి ఒకవైపు మాత్రమే. మరొకవైపు దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది.

ఉద్యోగంలో కనీసం నెల నెలా జీతం అయిన వస్తుంది. కానీ ట్రేడింగ్ లో ఎంత వస్తుంది అనేది గ్యారంటీ కూడా ఉండదు. ఒకరోజు లాభం రావచ్చు, మరొక రోజు నష్టం రావచ్చు. వీటిని మేనేజ్ చేసుకోగలగాలి. ట్రేడింగ్ చేస్తున్నంతసేపు ఒకరకమైన టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్ తట్టుకోగలగాలి. చాలా మంది వెబ్ సైట్ లలో, యూట్యూబ్ లలో  “10 నిమిషాలలో 15000 సంపాదించడం ఎలా? ట్రేడింగ్ లో లక్షలు సంపాదించడం ఎలా? ఇలాంటి టైటిల్స్ చూసి స్టాక్ మార్కెట్లో సంపాదించేద్దాం అని ఎటువంటి నాలెడ్జి లేకుండా, అప్పటివరకు కష్టపడి సంపాదించిన డబ్బుని పెట్టుబడిగా పెట్టి పోగొట్టుకుంటారు. మరి స్టాక్ మార్కెట్ లో సంపాదించలేమా అంటే సంపాదించవచ్చు. స్టాక్ మార్కెట్ లో కావలసినంత డబ్బు ఉంది. దానికంటూ ఒక పద్దతి ఉంది. అదెలా అనేది కూడా మనం తెలుసుకుందాం.

ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ని కెరీర్ గా ఎంచుకోవాలి అనుకుంటే ముందు మీరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.

1. స్టాక్ మార్కెట్ లో రాబడి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి కేవలం ట్రేడింగ్ మీదే ఆధారపడి కుటుంబాన్ని పోషించాలి అనుకోకండి. ఒకవేళ మీరు పూర్తి ట్రేడర్ గా మారాలి అంటే ముందు ఒక సంవత్సరం పాటు మీ కుటుంబ పోషణకు ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బుని మీ బ్యాంకు అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఎట్టి పరిస్థితులలోను ఆ డబ్బుని ట్రేడింగ్ లోకి తీసుకురాకండి.  అది కేవలం మీ కుటుంబ పోషణ కోసం మాత్రమే.

2. మీకు ఎటువంటి అప్పులు లేకుండా చూసుకోండి. కొంతమందికి హోమ్ లోన్స్, EMI లు ఉంటాయి. స్టాక్ మార్కెట్ లో వచ్చే లాభాలకు గ్యారంటీ ఉండదు కాబట్టి ట్రేడింగ్ లోకి దిగే ముందు ఈ అప్పులన్నీ తీర్చేసుకోవడం మంచిది.

3. మీరు ఫుల్ టైం ట్రేడర్ గా మారాలి అనుకుంటే ట్రేడింగ్ చెయ్యడానికి మీ దగ్గర కనీసం 2 నుండి 5 లక్షల రూపాయలు అయినా ఉండాలి. అంతేకాని ఒక పదివేల రూపాయలతో ట్రేడింగ్ మొదలు పెట్టి కుటుంబాన్ని పోషించేంత డబ్బు సంపాదించేద్దాం అనుకుంటే అది అయ్యే పని కాదు.

4. స్టాక్ మార్కెట్ మీద మీకు పూర్తి అవగాహన వచ్చేవరకు కూడా మీరు చేస్తున్న ఉద్యోగాన్ని మానకండి. కనీసం ఒక సంవత్సరం పాటు మీరు మీ ఉద్యోగాన్ని చేసుకుంటూనే ఖాళీ సమయాలలో, సెలవు రోజుల్లో సమయాన్ని వృధా చెయ్యకుండా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోండి. ఒకవైపు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుంటూనే మరొక వైపు ట్రేడింగ్ చెయ్యడానికి కావలసిన డబ్బుని కూడా పోగేసుకోండి.

5. మీకంటూ సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఉంటే మంచిది. కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా మరొక ఆదాయ మార్గాన్ని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది.

6. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది నిరంతరం ఎమోషన్స్ తో కూడుకున్నది, నష్టాలు వచ్చేటప్పుడు ఎక్కువగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కాబట్టి మీరు వీటన్నిటిని తట్టుకునేలా ఉండగలగాలి.

7. స్టాక్ మార్కెట్ మీద ఆసక్తి ఉన్నవాళ్లు మాత్రమే స్టాక్ మార్కెట్ లో విజయం సాధించగలరు. కేవలం డబ్బు కోసం మాత్రమే ట్రేడింగ్ చెయ్యకూడదు. ట్రేడింగ్ చేస్తున్న ప్రతీ క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయగలగాలి. ప్రతి రోజు ఎంత డబ్బు సంపాదించాం అనేది కాదు ఎంత నేర్చుకున్నాం అనేది చూసుకోవాలి.

స్టాక్ మార్కెట్ అనేది డబ్బుతో వచ్చినవారికి అనుభవాన్ని, అనుభవంతో వచ్చిన వారికి డబ్బుని ఇస్తుంది. సరైన నాలెడ్జి, క్రమశిక్షణతో ట్రేడింగ్ చేస్తే స్టాక్ మార్కెట్ లో మనం ఊహించనంత డబ్బుని సంపాదించగలం. స్టాక్ మార్కెట్లు మనల్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లగలవు, తేడా వస్తే పాతాళమంత లోతుకి కూడా పడెయ్యగలవు.

ఒక్కటి గుర్తుపెట్టుకోండి. స్టాక్ మార్కెట్ లో 90% మంది నష్టపోతుంటే కేవలం 10% మంది మాత్రమే లాభపడుతున్నారు. ఈ 90% మంది పోగొట్టుకున్న డబ్బంతా కూడా ఈ 10% మంది దగ్గరకు వెళ్తుంది. మరి మనం కూడా ఆ 10% మందిలో చేరాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి అనేది ఈ వెబ్ సైట్ లో ముందు ముందు ఆర్టికల్స్ లో తెలుసుకుందాం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *