టిప్స్ ని కాదు మిమ్మల్ని మీరు నమ్ముకోండి.
మనం స్టాక్ మార్కెట్ (Stock Market) లోకి ఎంటర్ అయిన తరువాత కొన్ని రోజులకి మన ఫోన్ కి కొన్ని మెసేజ్ లు రావడం మొదలువుతుంది.
ఉదాహరణకి ఫలానా షేర్ (Share) పెరుగుతుంది. ఈ ప్రైస్ దగ్గర కొనుక్కోండి. ఈ ప్రైస్ దగ్గర అమ్మండి. ఇలాగే ప్రతి రోజు టిప్స్ కావాలంటే కొంత డబ్బు చెల్లించి ఈ గ్రూప్ లో చేరండి అని వస్తుంది. ఆ రోజు సాయంత్రం మేము చెప్పినట్టే షేర్ ప్రైస్ పెరిగింది. ఇలాగే రోజూ లాభాలు సంపాదించాలి అంటే మా గ్రూప్ లో చేరండి అని మళ్ళీ మెసేజ్ వస్తుంది. మొదటి రోజు ఆలోచిస్తాం.
రెండవ రోజు మళ్ళీ అలాగే వేరే షేర్ ని ఫలానా ప్రైస్ దగ్గర కొని ఫలానా ప్రైస్ దగ్గర అమ్మండి అని మెసేజ్ వస్తుంది. అది కూడా చెప్పినట్టే జరుగుతుంది. దానితో మనకి కొంచెం నమ్మకం కుదురుతుంది. మూడవరోజు కూడా మళ్ళీ అలాంటి మెసేజ్ వస్తుంది అది కూడా చెప్పినట్టే సక్సెస్ అవుతుంది. మూడవ రోజు చివరిలో ఈ విధంగా మెసేజ్ వస్తుంది. ” వరుసగా మూడు రోజులపాటు మా టిప్స్ సక్సెస్ అయ్యాయి. మీ మూడు రోజుల ఫ్రీ ఆఫర్ అయిపోయింది. మీరు ప్రతిరోజూ మా టిప్స్ ని పొందాలనుకుంటే డబ్బు చెల్లించి మా గ్రూప్ లో చేరండి అని వస్తుంది.
వరుసగా మూడు రోజులు వాళ్ళు చెప్పినట్టే జరగడంతో ప్రతి రోజు ఇలాగే సక్సెస్ అవుతాయి అనే ఒక నమ్మకంతో డబ్బులు కట్టి ఆ గ్రూప్ లలో చేరిపోతారు. కానీ ఆ తరువాత నుండి వచ్చే టిప్స్ లో సగం సక్సెస్ అవుతాయి సగం ఫెయిల్ అవుతాయి. మరి మొదట్లో ఎలా అన్ని సక్సెస్ అయ్యాయి? దీని వెనకాల చాలా కథ నడుస్తుంది. అదేంటో చూద్దాం.
ముందుగా వీళ్ళు రకరకాల వెబ్సైటు ల నుండి కొన్ని వేలమంది ఫోన్ నంబర్ లను తీసుకుంటారు.
ఉదాహరణకి పదివేల మందిని తీసుకుని వాళ్ళని A, B రెండు గ్రూప్ లుగా విడగొడతారు. వీళ్ళలో A గ్రూప్ కి అంటే 5000 మందికి మొదటి రోజు రిలయన్స్ షేర్ పెరుగుతుంది కొనమని చెప్తారు. B గ్రూప్ కి అంటే మరొక 5000 మందికి రిలయన్స్ షేర్ పడిపోతుంది, అమ్మేయమని చెప్తారు (Short Sell). ఆ రోజు రిలయన్స్ షేర్ పెరగడం గాని తగ్గడం గాని జరుగుతుంది. ఒకవేళ పెరిగితే A గ్రూప్ వాళ్ళకి నమ్మకం కుదురుతుంది. మరొకవైపు పడిపోతుంది అని పంపిన B గ్రూప్ వాళ్ళకి నమ్మకం పోతుంది కాబట్టి ఈ 5000 మందిని పక్కన పెట్టేస్తారు.
తరువాత రెండవ రోజు A గ్రూప్ లో ఉన్న 5000 మందిని తీసుకుని వాళ్ళని మరలా 2 గ్రూప్ లుగా విడగొడతారు.
ఇప్పుడు A గ్రూప్ లో 2500 మంది, B గ్రూప్ లో 2500 మంది ఉంటారు. ఇప్పుడు A గ్రూప్ కి ITC షేర్ పెరుగుతుంది అని B గ్రూప్ కి ITC షేర్ పడిపోతుంది అని పంపుతారు. ఒకవేళ ITC షేర్ పడిపొతే B గ్రూప్ వాళ్ళకి 2 సార్లు సక్సెస్ అయినట్టు. ఇక్కడ A గ్రూప్ కి ఫెయిల్ అయ్యింది కాబట్టి వాళ్ళని పక్కన పెట్టేస్తారు.
తరువాత మూడవ రోజు B గ్రూప్ లో ఉన్న 2500 మందిని తీసుకుని వాళ్ళని మరల 2 గ్రూప్ లుగా విడగొడతారు.
ఇప్పుడు A గ్రూప్ లో 1250 మంది, B గ్రూప్ లో 1250 మంది ఉంటారు. ఇప్పుడు A గ్రూప్ కి SBI షేర్ పెరుగుతుంది అని, B గ్రూప్ కి SBI షేర్ పడిపోతుంది అని పంపుతారు. ఒకవేళ SBI షేర్ పెరిగితే A గ్రూప్ వాళ్ళకి 3 సార్లు వరుసగా సక్సెస్ అయినట్టు. ఇక్కడ B గ్రూప్ కి ఫెయిల్ అయ్యింది.
చివరిగా A గ్రూప్ లో 1250 మందికి వరుసగా మూడు రోజులు పంపిన టిప్స్ సక్సెస్ అయ్యాయి కాబట్టి కనీసం వాళ్లలో 1000 మంది 1000 రూపాయలు చెల్లించి ఆ గ్రూప్ లో చేరారు అనుకుందాం. వాళ్ళకి 10 లక్షలు రూపాయలు వస్తుంది. ఈ విధంగా ఆన్లైన్ లో టిప్స్ పంపే బిజినెస్ లు జరుగుతాయి. అలాగని అన్ని కంపెనీ లు మోసం చేస్తాయని చెప్పడం లేదు. కొన్నిటిలో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
స్టాక్ మార్కెట్ లో ఏ షేర్ పెరుగుతుంది, ఏ షేర్ పడిపోతుంది అనేది ఎవరూ చెప్పలేరు. Norman Ralph Augustine అనే ఒక వ్యాపారవేత్త ఈ విధంగా అంటారు. ” స్టాక్ మార్కెట్ నిపుణులు నిజంగా అంత నిపుణులైతే, వారు ఏ షేర్ కొనాలి, ఏ షేర్ అమ్మాలి అనే సలహాలు అమ్మకుండా, స్టాక్ ని కొనుక్కుంటారు” అని.
నిజమే కదా.. ! ఏ షేర్ పెరుగుతుంది, ఏ షేర్ పడుతుంది అనేది తెలిస్తే వాళ్లే ట్రేడింగ్ చేసి లాభాలు సంపాదించవచ్చు కదా. కాబట్టి ఈ విషయాన్నీ గుర్తుపెట్టుకోండి. అలాగే మరికొంతమంది మా దగ్గర ఉన్న స్టాటజీ 100% పని చేస్తుందని ప్రచారం చేస్తూ ఉంటారు. స్టాక్ మార్కెట్ లో ఏ స్ట్రాటజీ కూడా 100% సక్సెస్ అవ్వదు . ఒకవేళ అలా ఎవరైనా చెప్పిన నమ్మకండి.
అయినా మనం ఇలా ఎవరో చెప్పే టిప్స్ ని ఫాలో అవుతూ ఉంటే మనం ఎప్పుడు నేర్చుకుంటాం? ఎంత కాలం ఇతరుల మీద ఆధారపడతాం. అదే కొంచెం సమయం తీసుకున్నా సరే మనమే నేర్చుకుంటే ఎవరి మీద ఆధారపడవల్సిన అవసరం లేదు. ఒకవేళ లాభం వస్తే ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వవలసిన అవసరం లేదు, నష్టం వస్తే ఎవరిని నిందిస్తూ బాధపడవలసిన అవసరం లేదు.
కాబట్టి స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకుని సొంతంగా ట్రేడింగ్ చెయ్యడానికి ప్రయత్నించండి.
#StockMarketTeugu #StockMarketTips